Monday 9 February, 2009

అ'సత్యం'

ఒక సామ్రాజ్యం నిర్మించటానికి కొన్ని ఏళ్ళు పడుతుంది. కాని దాన్ని కూల్చటానికి కొన్ని నిమిషాలు చాలు.
ఒక వ్యక్తి తన గొప్పతనం నిరూపించుకోవటానికి జీవిత కాలం సరిపోదేమో కాని అది పోగొట్టుకోవటానికి ఒక్క క్షణం చాలు.
నమ్మే వాళ్లు నమ్మినంత కాలం నమ్మించినవన్ని నిజాలవుతాయనుకుంటే ఒక రోజు మనను ఎవరు నమ్మని రోజు వస్తుంది.

రామలింగ రాజు.......
ఇరవై ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో .టి. ప్రగతికి, పురోగతికి తనవంతు సాయం చేసిన వ్యక్తి. బంగళూరులో ఉన్న .టి. సామ్రాజ్యాన్ని హైదరాబాదు వరకు విస్తరించటానికి దోహదపడిన వ్యక్తి. ప్రభుత్వ సహకారంతో 108 రూపంలో ప్రజలకు సేవలందించటం, బైర్రాజు ఫౌండేషన్, సత్యం అనే పేరుతో వేలాది ఉద్యోగులకు ఉపాధి కల్పించటం....... ఇలా చెప్పుకుంటూపోతే ఆయన చేసిన మంచి పనుల చిట్టా చాలా పెద్దదే.
ఇన్నేళ్ళుగా పేరులోని రాజునే మకుటంలా ధరిస్తూ ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి, ఒక్క క్షణంలో అన్నీ పోగొట్టుకొనిఇప్పుడు అదే ప్రజలందరి చేతా మోసగాడు, దొంగ అనిపించుకుంటున్నాడు. ఎలా జరిగిందిదంతా?
ఒక్క అబద్ధం, తాను తన సౌలభ్యం కొరకు సృష్టించిన ఒక్క అబద్ధం ఇంతితై - వటుడింతై అన్నట్టుగా పెరిగి పెద్దదై తిమింగలంలా మారి తిరిగి తననే మింగేసింది. ఒక్క తప్పుకి ఇంత పెద్ద శిక్షా? అవును.... తప్పు ఎలాంటిదైనా శిక్ష మాత్రం జీవితాంతం గుర్తుంచుకునేలా ఉంటుంది. చివరకు దొంగ దొరికాడు. అసలు ఆయనను పట్టుకునే తెగువ ఎవరికుంది? ఇన్ని ఏళ్లుగా ఆయన మాటలతోనే కాక చూపులతోనూ చేస్తున్న మోసాన్ని గమనించటం ఎవరి తరం కాలేదు. మైటాస్ కుంభకోణం తర్వాత చేసేదేమీ లేక ఆయనే తప్పు ఒప్పుకున్నారు. చేసిన తప్పు, దాని పర్యవసానాలు అన్నీ వ్రాతపూర్వకంగా రాసి సంతకం పెట్టి ప్రజల ముందు ఉంచాడు. అందరూ చదివారు. అందులో ఉన్న విషయాలన్నీ నిజమే అని నమ్మారు. ఒక్క విషయం తప్ప.... "సత్యం కొరకు చేయగలిగినంతా చేశాను. కంపెనీ కొరకు నా సొంత డబ్బులుపెట్టానే కాని ఎన్నడూ కంపెనీ డబ్బులు నా స్వప్రయోజనాలకు వాడుకోలేదు." ఒక్క మాట ఎవరూ నమ్మలేదు.

కూరిమి గల దినములలో నేరములెన్నడు గలుగనేరవు.
మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతీ.

ఎప్పుడైతే ఆయన చేసింది తప్పని తెలిసిందో, వెంటనే ఆయన చేసినవన్నీ తప్పులే అనే అభిప్రాయానికి వచ్చారు జనం. పోలీసులు రాజు గారిని అదుపులోకి తీసుకొని విచారణ మొదలు పెట్టారు.
ఇక్కడే మొదలైంది అసలు కథంతా. రాజు కథని యెవరికి అవసరమున్నట్టుగా వాళ్లు వాడుకోవటం మొదలు పెట్టారు.
మణిరత్నం "ఇద్దరు" సినిమాలో ప్రకాష్ రాజ్ తో అంటాడు
మోహన్ లాల్ "రాజకీయం.... మట్టి గడ్డలు" అని. తర్వాత ఆయన కూడా రాజకీయాల్లోకి వస్తాడు. అది కథ(వాస్తవం కూడానూ).
మరి మన రాజు కథకీ, మట్టి
గడ్డలకి సంబంధం ఏంటి? మట్టిని మాణిక్యం చేయటం మహానుభావిడికి కూడా వల్ల కానిపని. కాని అదే మట్టిని చూపించి మాణిక్యం అని భ్రమింపచేయటంలో దిట్టలు మన రాజకీయ నాయకులు. రాజు కథని అన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా (ప్రత్యర్థులకు ప్రతికూలంగా) మార్చుకునే ప్రయత్నాలు చేసాయి. రాజుతో కలిసి ఉన్న ఫోటోలు చూపించి, ఆయనతో కలిసి ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు ప్రస్తావించి ఒకరిపై ఒకరు బురదజల్లుకోవటం మొదలు పెట్టారు. అందరూ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి.... ఆయన గత పదిహేను సంవత్సరాలుగాపార్టీలకతీతంగా ప్రభుత్వంతో కలిసి ఎన్నో మంచి పనులు, ముఖ్యమైన పనులు చేసారు. ఒక్క విషయంలో తప్పు చేసాడని ఆయన చేసిన పనులన్నీ తప్పులనటం మీ మూర్ఖత్వం. మీ స్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి చెత్త ఎత్తుగడలతో ప్రజలను మోసం చేయాలని ప్రయత్నించి ఇప్పటికే దిగజారి ఉన్న రాజకీయాలను మరింత భ్రష్టు పట్టించొద్దు.
ఇక పోతే మీడియా వారు ప్రజల మెప్పు కొరకు రాజు పైనా, సత్యం కంపెనీ పైనా జోకులు విసరటం సర్వసాధారణమైపోయింది. మీరు వేసే ప్రతీ జోకు ఎందరో సత్యం ఉద్యోగుల మనసుల్ని బాధింపజేస్తుందన్న విషయం మరవొద్దు. పక్క వాడి బాధతో హాస్యమాడి మానవాతా విలువల్ని దిగజార్చొద్దు. అలా చేస్తే తాడిని తన్నే వాడికి తలదన్నేవాడొకడు ఉంటాడనే విషయం మీకు కూడా ఏదో ఒక రోజు బోధపడుతుంది. అప్పుడు బాధ పడటం మినహా చేయగలిగిందేముండదు. నేనేమీ రాజుని హీరోని చేయట్లేదు. ఆయన చేసింది ముమ్మాటికీ తప్పే. దానికి శిక్ష ఇప్పటికే అనుభవిస్తున్నాడు. అసత్యం అవసరానికి అక్కరకొచ్చినా, తర్వాత అందరినీ నట్టేట ముంచుతుందనే విషయం రాజుకి పాటికే అర్థం ఐపోయుంటుంది.
చివరగా భారత దేశ స్వాతంత్రోద్యమంలో గాంధి గారి పాత్ర ఉన్నట్టే, ఆంధ్ర రాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీరాములు గారి పాత్రఉన్నట్టే, .టి. పరిశ్రమ హైదరాబాదులో విస్తరించటంలో రాజు గారి పాత్ర కూడా ఉంది అన్నది వాస్తవం. కనీసం ఆయన చేసిన మంచిని దృష్టిలో ఉంచుకొని ఐనా ఆయనని ప్రతీ విషయంలో తప్పు గా చిత్రీకరించటం మానండి. ఆయన కలల కంపెనీ సత్యంని చిన్న చూపు చూడటం మానండి.


ఇట్లు,
ఒక మనిషి.

4 comments:

  1. ఇంతితై - వటుడింతై అన్నట్టుగా nuvvu daily okkokka post tho andanantha dooralaku pothunnav ga macha, ee ost kooda naaku nachindi, come on carry on

    ReplyDelete
  2. Thanq Thanq.... next deni meeda raayamantaavo cheppu. Nee aagna shirasaavahista.

    ReplyDelete
  3. After looking at your post i really feel that my post regardign raju should be moved.
    The best post regarding raju is urs...

    ReplyDelete
  4. thank you very much vishal.. But don't delete urs seriously.. U discussed many interesting points in ur post. and the most important thing is we r just expressing our views.

    ReplyDelete