Tuesday 2 June, 2009

ప్రయాణం

నటీనటవర్గం: మనోజ్ కుమార్,హారిక,బ్రహ్మానందం,జనార్ధన్,కల్పిక,తమీం మరియు డేనియల్
సంగీతం: మహేష్ శంకర్
నిర్మాత: సీత యేలేటి
రచన - దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి
తరహా: ప్రేమ
ఫలితం: మంచి సినిమా

మూల కథ:
విమానాశ్రయం లో ప్రేమకథ. తొలి చూపులో ప్రేమించిన అమ్మాయిని ఉన్న రెండు గంటల సమయంలో ప్రసన్నం చేసుకునే హీరో ప్రయత్నమే ఈ ప్రయాణం.

వివరాలు:
ఒక రకంగా ఇది థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. హీరో హీరోయిన్ ని కౌలాలంపూర్ విమానాశ్రయం లో చూస్తాడు. తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అమ్మాయేమో ఇండియా ప్రయాణం. మనోడేమో సింగపూర్ వెళ్తుంటాడు. చేతిలో ఉన్న సమయం రెండు గంటలు. మరి మిత్రుల సహకారంతో మన హీరో అనుకున్నది సాధించాడా లేదా అన్నది అసలు కథ. కాకపోతే ఇన్నేళ్ళ సినీ అనుభవం ఉన్న మనకు క్లైమాక్స్ రాకుండానే జరిగేది ఏమిటో తెలిసిపోతుందిలే గాని ఆ మధ్యలో వచ్చే సన్నివేశాలు మాత్రం అందర్నీ ఆకట్టుకుంటాయి. ప్రతి సన్నివేశాన్ని హాస్య ప్రధానంగా తీసారు. తొంభై శాతం సినిమా విమానాశ్రయం లోనే ఉంటుంది. అక్కడ భిన్న మనుషులు, వారి మధ్య సంభాషణలు, తినటం, తిరగటం, నచ్చిన అమ్మాయి వెంట పడటం, ఆమెను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చెయ్యటం ఇదే హీరో మరియు ఆయన మిత్రులు చేసే పని. హీరోయిన్ కి ఐతే హీరో ని తప్పించుకుని తిరగటం తోనే సరిపోద్ది. ఎప్పటికప్పుడు కథ లో కామెడీ విలీనమై ఉంటుంది. పాటలు కూడా కథ లో భాగంగానే ఉంది మంచి ఫీల్ ని ఇస్తాయి. ఇక్కడే చెప్తే కథలో చెప్పుకునేంత కొత్త విషయాలు ఏమీ ఉండవు గానీ చిత్రీకరణ మాత్రం చాలా బాగుంది. సినిమాలో ఎక్కడా అతి గానీ, ఫైట్స్ గానీ ఉండవు. పూర్తిగా ప్రశాంత వాతావరణంలో తీసిన సినిమా. హాస్యం, ప్రేమ ప్రధానంగా ఉంటాయి అన్ని సన్నివేశాలు.

నటన:
మనోజ్ రోజు రోజుకి నటుడిగా మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. బుగ్గ పైన సొట్ట బాగా సూట్ అయ్యింది మనోజ్ కి. నవ్వు కూడా బాగుంది. మిగతా సినిమాలతో పోలిస్తే మనోజ్ నటన ఎన్నో రెట్లు మెరుగు పడింది ఈ సినిమా లో. హీరోయిన్ గా హారిక బా"గానే" చేసినప్పటికీ "గానే" అనే అవకాశం కూడా ఇచ్చుండకపోతే బాగుండేది. ఆమె కళ్ళల్లో మంచి మెరుపు ఉంది, నవ్వు బాగుంది. అవి చాలనుకున్నాడేమో దర్శకుడు మరి. బ్రహ్మానందం ఎప్పటిలాగే నవ్వులు పూయించాడు. హీరో ఫ్రెండ్ చెప్పే ఉగ్రనరం కథ, దానికి బ్రహ్మానందం ఫీల్ అయ్యే తీరు చాలా బాగుంది. హీరో ఫ్రెండ్స్ ఇద్దరు అలాగే హీరోయిన్ ఫ్రెండ్ వాళ్ళ పరిధిలో బాగా నటించారు.

సాంకేతిక విభాగం:
దర్శకుడిగా చంద్రశేఖర్ యేలేటి ప్రతిభ మరో మారు మనకు స్పష్టం కనపడుతుంది. కథ, తీయాలనుకున్న సన్నివేశాలపై మంచి పట్టు ఉన్నట్టుగా తెలిసిపోతుంది. తన గత చిత్రాల మాదిరే ఇది కూడా ప్రేక్షకులను ఆహ్లాదకర వాతావరణంలో ముంచెత్తుతుంది. చందు త్వరలోనే తెలుగు సినిమాలకి మంచి పేరు తీసుకురాగల దర్శకుడిగా ఎదుగుతాడు. స్క్రీన్-ప్లే ఆకట్టుకున్నప్పటికి మరింత పట్టుగా ఉంటే బాగుండేది. మహేష్ శంకర్ అందించిన నాలుగు బాణీలు మొదటి సారే మొత్తంగా నచ్చకపోయినా మళ్లీ మళ్లీ వింటుంటే మరీ మరీ వినాలనిపించేలా ఉన్నాయి. అన్ని పాటలు సందర్భోచితంగా వచ్చేవే. పాటల్లో సాహిత్యానికీ పెద్ద పీట వేసినట్టు స్పష్టంగా తెలిసిపోతుంది. అన్ని పాటలు అనంత్ శ్రీరామ్ చాలా బాగా రాసాడు. కెమెరా మలేషియా ని అందంగా చూపించటంలో పూర్తిగా సఫలమైంది. నిర్మాత గా సీత యేలేటి అనే పేరు వేసారు. నా మట్టుకైతే చందు సొంతంగా సినిమా నిర్మించుకున్నాడనే భావన కలిగింది. టైటిల్ కార్డు దగ్గర నుండి సినిమా ఆద్యంతం మంచి టేస్ట్ కనపడుతుంది.

చివరి మాట:
ప్రయాణం వేగంగా సాగకపోయినా మరీ సాగాతీతగా మాత్రం ఉండదు. రెండు గంటల పాటు మంచి వినోదం కోరుకునే ప్రేక్షకులు మరో ఆలోచన లేకుండా సినిమా చూసుకోవచ్చు. ఆకట్టుకునే నటన, మంచి హాస్యం, సున్నితమైన ప్రేమ ఈ సినిమాకు బలాలు.

వినోదం: 10 కి 7

No comments:

Post a Comment