నటీనటవర్గం: విక్రమ్, కృష్ణ, శ్రియ, ప్రభు, ఆశిష్ విద్యార్ధి, ముఖేష్ తివారి.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.
నిర్మాత: కలైపులి ఎస్.థాను
రచన - దర్శకత్వం: సుశి గణేశన్
తరహా: సూపర్ హీరో
ఫలితం: ఫరవా లేదు!!
మూల కథ:ధనవంతుల దగ్గరి డబ్బుని దోచి దేవుడి పేరుతో పేదలకు పంచి ఇవ్వటం.
వివరాలు:
సినిమా క్లిప్పింగ్స్ చూస్తేనే ఇది సూపర్ హీరో తరహా కథ అని తెలిసిపోతుంది. మల్లన్న సినిమా గతం లో మనం చూసిన శివాజీ, అపరిచితుడు, ఠాగూర్ సినిమాలవలె అనిపిస్తుంది. విక్రమ్ సి.బి.ఐ. ఆఫీసర్ గ పనిచేస్తుంటాడు. అలాగే పట్టుకున్న డబ్బులో మొత్తం గవర్నమెంట్ కే అప్పగించకుండా అందులో కాస్త డబ్బు తీసుకెళ్ళి పేదలకి పంచుతుంటాడు. ఐతే ఒక ప్లాన్ ప్రకారం శ్రీశైలం లోని మల్లన్న ఆలయం లో దైవ సహాయం కోసం జనాలు చెట్టుకు కట్టే కోరికల చిట్టాలన్నీ సేకరించి వారి వారి కోరికల ప్రకారం సహాయం చేస్తుంటాడు. ఇది చెయ్యటానికి చాల మంది మిత్రులు విక్రమ్ కి సహాయపడుతుంటారు. ఇంతే కాక అప్పుడప్పుడు కోడిమనిషి వేషం లో వెళ్లి తప్పు చేసిన వారిని శిక్షిస్తుంటాడు. ఇలాగే ఒక సారి ధనవంతుడైన ఆశిష్ విద్యార్ధి ఇంటికి రైడ్ కి వెళ్లి పెద్ద మొత్తం స్వాధీనం చేసుకుంటాడు. దానికి కోప్పడి ఆశిష్ విద్యార్ధి, ఆయన కూతురు శ్రియ ఇద్దరు విక్రమ్ ని ఎలాగైనా చంపాలని ప్రయత్నిస్తారు. ఇక అక్కడనుండి ఇంక కొంత మంది విక్రమ్ చేతిలో భంగపడ్డ ధనవంతులు అందరు విక్రమ్ పైన పగ తీర్చుకోవటానికి ట్రై చెయ్యటం, విక్రమ్ వాటన్నింటిని తప్పించుకొని అందరికి బుద్ధి చెప్పటం అది కథ. మధ్యలో అసలు ఇంత డబ్బు పేదలకు పంచి పెట్టేదేవరో తెలుసుకునేందుకు పోలీస్ ఆఫీసర్ ప్రభు ప్రయత్నిస్తుంటాడు. సినిమా గడుస్తున్న కొద్ది ఎందరో కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతుంటారు. ఇక ఇది సినిమా కాబట్టి హీరో హీరోయిన్ విక్రమ్, శ్రియల మధ్యలో ప్రేమ, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఇవన్ని కథని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం లో ప్రేక్షకులకు కాస్త చిరాకు కలిగిస్తాయి. సినిమా మొదటి భాగం కాస్త పెద్దదిగా అనిపించినప్పటికీ బానే ఉంటుంది. ద్వితీయార్థం మాత్రం ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెట్టినట్టుగా ఉంటుంది. మల్లి చివర్లో కథ కాస్త ఊపందుకున్నా అప్పటికే కథా గమనం వల్ల నిద్రకుపక్రమించిన ప్రేక్షకులను తృప్తి పరిచే లెవెల్ లో మాత్రం ఉండదు. ప్రయత్నం మంచిదే అని క్లియర్ గా అర్థం అయినా కథనం లో పట్టు లేక సినిమా యావరేజ్ గ నిలిచిపోతుంది.
నటన:
విక్రమ్ చాలా అందంగా ఉండి నటనలో కూడా మంచి మార్కులు కొట్టేస్తాడు. అంతకు ముందు అన్ని సినిమాల్లో కంటే ఇందులో ఇంకా అందంగా కనపడి హాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నాడు. కథలో భాగంగా ఎన్నో వేషాలు వేసి అన్నింట్లోను మంచి ప్రతిభ కనబరచాడు. పాటలు కూడా అన్ని విక్రమ్ పాడాడు. ఒక సినిమా కోసం విక్రమ్ పడ్డ శ్రమ కి ఎంతో మెచ్చుకోవచ్చు. నటన పరంగా ఇది విక్రమ్ కి చెప్పుకోదగ్గ సినిమా. శ్రియ పూర్తిగా అందాల ఆరబోత కే అన్నట్టుగా ఉండి. ఇచ్చిన పాత్రలో ఆమె బానే చేసినా పాత్ర బాలేక ఆమె సన్నివేశాలు వచినప్పుడల్లా కథాగమనాన్ని పాడు చేసిన ఫీలింగ్ కలుగుతుంది. వందల సినిమాల్లో నటించిన సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇదేమంత కష్టపెట్టే రోల్ కాదు. ఎప్పటిలానే ఈ పాత్రలో కూడా పరిధి మేరకు బాగా నటించాడు. కాని అప్పుడెప్పుడో నెంబర్ వన్ సినిమా తర్వాత హిట్ లేక ఆయన ఉన్న అన్ని సినిమాల్లో ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఆయనకి మల్లన్నతోనూ అదృష్టం మారకపోవటం బాధాకరం. ప్రభు బానే చేసాడు. ఇక విలన్స్ గ ఆశిష్ విద్యార్ధి, ముఖేష్ తివారి తమ పాత్ర బానే పోషించారు. హీరో మిత్రులుగా ఒక ఆరు-ఏడు మంది ఉంటారు. అందరు బానే చేసారు.
సాంకేతిక విభాగం:
దర్శకుడు సుశి గణేశన్ మంచి కథనే ఎంచుకున్నా కథనం బాలేక చేసిన శ్రమ అంత వృధా అయ్యింది. కావలసినంత బడ్జెట్, సమయం, విక్రమ్ లాంటి నటుడు అందుబాటులో ఉన్నప్పుడు ఇంక మంచి కథనంతో రావాల్సింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరీ గొప్పగా లేకున్నా బానే ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బులన్నీ కెమెరామన్ చాలా బాగా వాడుకొని అద్భుతమైన ఫోటోగ్రఫీ తో ఆకట్టుకున్నాడు. మెక్సికో అందాలతో పాటు అన్ని ఇండియా లో జరిగిన సన్నివేశాలను కూడా బాగా చూపించటంలో సఫలీకృతుడయ్యాడు. ఎడిటింగ్ బాలేదనే చెప్పుకోవచ్చు. సినిమా లెంగ్త్ తో పాటు మధ్యలో టెక్నాలజీ పేరుతో మార్చి మార్చి స్క్రీన్లు చుపటంతో ప్రేక్షకులకు అప్పుడు విసుగొస్తుంది. దర్శకుడి కథను నమ్మి ప్రొడ్యూసర్ ఖర్చుకి వెనుకాడకుండా మంచి క్వాలిటీ సినిమా ప్రేక్షకులకు అందించాడు.
చివరి మాట:
సన్నివేశాలన్నీ ఆల్రెడీ శంకర్ సినిమాల్లో చుసేసినట్టుంటుంది. విక్రం చాలా రెఫ్రెషింగ్ గా కనిపిస్తాడు. తెర పైన విక్రం ని ౩ గంటల పాటు చూస్తే చాలనుకునే ప్రేక్షకులు మరో మాట ఆలోచించకుండా సినిమాకి వెళ్లిపోవచ్చు. కాన్సెప్ట్ బాగున్నా దర్శకుడు దానికి ప్రిపేర్ చేసుకున్న కథనం అంత బాలేదు.
వినోదం: 10 కి 5
No comments:
Post a Comment