Saturday, 5 June, 2010

వేదం

నటీనటవర్గం: అల్లు అర్జున్, మనోజ్ మంచు, అనుష్క, నాగయ్య, మనోజ్ భాజపాయ్, సియా గౌతమ్, రవికాంత్, శరణ్య
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
నిర్మాత: ప్రసాద్ దేవినేని, శోభ యార్లగడ్డ
కథ - కథానువాదం -దర్శకత్వం: క్రిష్(రాధాకృష్ణ జాగర్లమూడి)
ఫలితం: చూసి తెలుసుకోండి... మంచి సినిమా

మూల కథ:
ఇది 5 కథల సమాహారం. భిన్న వ్యక్తులు, వారి బాధలు, వాటికి సమకాలీన అంశాలు జోడించి తీసిన సినిమా.

వివరాలు:
గమ్యం అనే ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించిన దర్శకుడు క్రిష్. వ్యాపారపరంగా మంచి లాభాలు రాబడుతూనే అవార్డుల్లోను అధ్బుతంగా రాణించిన సినిమా అది. క్రిష్ ద్వితీయ ప్రయత్నంగా తీసిన చిత్రం 'వేదం'. సినిమా మొదలు పెట్టినప్పటినుండి తెలుగులో మల్టిస్టారర్ చిత్రాలకు తిరిగి నాంది పలుకుతున్న చిత్రంగా అందరిలోనూ ఆత్రుత కలిగించిన సినిమా. పెద్ద తారలున్నా ఖచ్చితంగా ఇది దర్శకుడి సినిమానే అని అందరు నమ్మిన సినిమా. దేశం, రాష్ట్రం, ఊరు, పేరు, కులం, మతం, జాతి, భాష ఇవేవి కావు.. మానవత్వమే ముఖ్యం అని గట్టిగా చాటే సినిమా వేదం. సందేశాత్మక చిత్రమే అయినా ప్రేక్షకులకు నచ్చేలా తీయటంలో సఫలమయ్యాడు దర్శకుడు.
తల్లి మిలిటరీ లో చేరమంటే తను మాత్రం రాక్ బ్యాండ్ పెట్టి ప్రదర్శనలు ఇచ్చే పాత్రలో మనోజ్ నటించాడు. స్వతహాగా ఎవరికీ సహాయం చేసే గుణం ఉండదు. ఎవరో ఒకరు చేస్తార్లే అనుకుంటాడు. ఒక ప్రదర్శన కొరకు బంగళూరు నుండి హైదరాబాద్ బయదీరుటాడు మిత్రులతో కలిసి. సిరిసిల్ల లో చేనేత కార్మికునిగా చేస్తూ చేసిన అప్పు తీర్చలేక దొర తన మనవణ్ణి పనిలోకి లాక్కెల్తే ౩ రోజుల్లో బాకీ తీర్చి మనవణ్ణి బాగా చదివిన్చుకుందాం అని కోడలు శరణ్య తో కలిసి డబ్బు సంపాదించటానికి హైదరాబాద్ బయల్దేరుతాడు నాగయ్య. వినాయక ఉత్సవాల్లో జరిగిన గొడవలో ఏ తప్పు లేకుండా హిందూ భక్తులు, పోలీసుల చేతిలో దెబ్బలు తినటమే కాక అదే గొడవలో భార్య గర్భం కూడా పోగొట్టుకున్న మనోజ్ బాజపాయ్ ఇక్కడ బ్రతకటం ఇష్టం లేక దుబాయ్ వెళ్ళే ప్రయత్నం లో ఉంటాడు. అమలాపురం లో ఒక వేశ్యా గృహం లో పనిచేస్తూ అక్కడనుండి తప్పించుకొని హైదరాబాద్ బయల్దేరుతుంది సరోజ (అనుష్క). ధనవంతురాలైన అమ్మాయిని ప్రేమించి డబ్బులకి ఏవేవో తంటాలు పడే కేబుల్ రాజు పాత్రలో అల్లు అర్జున్ నటించాడు.
వీరందరి జీవితాలు భిన్న పరిస్థితుల ప్రభావం వాళ్ళ బోల్డు మలుపులు తిరిగుతాయ్. ఎలా వీళ్ళ పాత్రలు తమ ఆశయాలవైపు పరిగెడుతూ కష్టాలు పడ్డారో, ఎలాంతో ఆటుపోట్లకు లోనయ్యారో చూడాలంటే వెంటనే వేదం కి వెళ్ళండి.

నటన:
సినిమాలో అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క, నాగయ్య, మనోజ్ బాజపాయ్, రవికాంత్, శరణ్య, సియా గౌతమ్ వీరెవరు కనపడరు. వారి వారి పాత్రలే కనపడతాయి. అందరు చాలా బాగా చేసారు. ఇమేజ్ చట్రంలో ఉండకుండా దర్శకుడి భావాలకు అనుగుణంగా చేసినందుకు అర్జున్, మనోజ్, అనుష్కలను మెచ్చుకోవాలి. నటుల్లో నాగయ్య, మనోజ్ నన్ను బాగా ఆకట్టుకున్నారు. బ్రహ్మానందం ఒకే సన్నివేశంలో కన్పించి అందరిని నవ్వించి వెళ్తాడు. రఘుబాబు, పోసాని ల హాస్యం బాగుంది.

సాంకేతిక విభాగం:
కీరవాణి బాణీలు బయట విన్నదానికంటే సినిమాలో ఎక్కువ ఆకట్టుకున్నాయి. అన్ని పాటలు(ఒక్కటి మినహా) కథాగమనంలో భాగంగా వచ్చేవే. నేపథ్య సంగీతం బాగుంది. నిజజీవితానికి దగ్గరగా ఉన్న పాత్రలు, సన్నివేశాల్ని నిజంగా నిజమే అనిపించేలా చూపించినందుకు చాయాగ్రాహకుడు వి.ఎస్.జ్ఞానశేఖర్ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. దర్శకుడు క్రిష్ రెండో సినిమాలో కూడా మంచి మార్కులు కొట్టేస్తాడు. సన్నివేశాల్ని హృదయానికి హత్తుకునేలా తీయగలిగాడు. మంచి భవిష్యత్తు ఉన్న దర్శకుడు.

చివరి మాట:
మంచి నటన, హృదయానికి హత్తుకునే సన్నివేశాలు సినిమాకు బలం. హాలివుడ్ సినిమాల స్ఫూర్తి కనిపించినా తెలుగుదనం నిండుగా ఉంటుంది. ప్రథమార్థం లో కథని ఇంకాస్త పట్టుగా అల్లుకునుంటే బాగుండేది. మంచి కథ, సందేశాత్మక విలువలు, వాణిజ్య విలువలు కలిపి ఉన్న సినిమా. చూసిన ప్రేక్షకులకు కాసింత కంటతడి పెట్టిస్తూ ఆలోచింపచేసే సినిమా. మనిషికి మనిషి సహాయం చేసుకోటమే మానవధర్మం అని చెప్తుంది 'వేదం'. అందరు ఉహించినట్టుగా, ఎందరో సినీ ప్రముఖులు చెప్పినట్టుగా ఇది చరిత్ర సృష్టించే సినిమా కాకపోవచ్చేమో కానీ మంచి చిత్రం గా అయితే మిగిలిపోతుంది.

మార్కులు: 3.75/5

No comments:

Post a Comment