Friday 24 December, 2010

సినీ సమీక్ష: మన్మధ బాణం

నటీనటవర్గం: కమల్ హాసన్, మాధవన్, త్రిష, సంగీత, రమేష్ అరవింద్, ఊర్వశి, ఉషా ఉతుప్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత: సుబ్రహ్మణ్యం బి, రుమేష్ వై
కథ - కథానువాదం: కమల్ హాసన్
మాటలు: వెన్నెలకంటి
దర్శకత్వం: కే.ఎస్. రవి కుమార్
ఫలితం: అంతా అయోమయం!

మూల కథ:
ఒక ధనవంతుడు సినీ నటి అయిన తన ప్రేమికురాలి మీద అనుమానంతో ఒక గూడచారిని నియమిస్తాడు. ఆ పైన వచ్చే సంఘటనల సమాహారమే ఈ కథ.

వివరాలు:
ప్రముఖ సినీ నటి అంబుజాక్షి / నిషా (త్రిష), ధనవంతుడైన మదన్(మాధవన్) ప్రేమికులు. నిషా మీద అనుమానంతో భూషణం(కమల్) అనే గుడచారిని నియమిస్తాడు మదన్. నిషా తన మిత్రురాలైన దీప(సంగీత), ఆమె పిల్లలతో కలిసి ఐరోపా పర్యటనకు వెళ్తుంది. అక్కడ ఆమె గురించి తెలుసుకోటానికి వెంబడిస్తాడు భూషణం. భూషణం కి గతంలో ఒక కథ ఉంటుంది. అలానే ప్రస్తుతంలో కాన్సర్ ట్రీట్మెంట్ లో ఉన్న మిత్రుడి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మదన్ కి నిషా గురించి ఏవో చెప్పి డబ్బులు సంపాదిస్తుంటాడు. ఆ తర్వాత కథ చెప్పేస్తే ఇంక తెర పైన చూడటానికి ఏమీ మిగలదు.

నటన:
మాధవన్, త్రిష బాగా నటించారు. సంగీత కి చాల రోజులకి పెద్ద పాత్ర దక్కింది. ఆమె బాగా చేసింది. ఊర్వశి, రమేష్ అరవింద్, ఉషా ఉతుప్ అందరు పరిధి మేరకు బాగా నటించారు. ఎప్పటిలానే కమల్ ప్రేక్షకులని మెప్పిస్తాడు, కథంతా తానై నడిపిస్తాడు. పరిధులు లేని కమల్ నటన ఖచ్చితంగా సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది.

సాంకేతిక విభాగం:
కథ, కథనం లో కమల్ మార్కు కనపడుతుంది. సున్నితమైన కథ, వీలైనంత హాస్యం జొప్పించే ప్రయత్నం లో సాగుతుంది కథనం. ఒకింతగా బానే చేసారని చెప్పుకోవచ్చు. మాటలు తెలుగులో వెన్నెలకంటి ఐనప్పటికీ పూర్తిగా తమిళంలో కమల్ తో కలిసి రాసిన క్రేజీ మోహన్ మార్కు కనపడుతుంది. కొరియోగ్రఫీ సహజంగా ఉంది. కెమెరా పనితనం ఆకట్టుకుంది. సినిమా ఎక్కువ భాగం జరిగే గ్రీసు, బార్సిలోన, వెనిస్ అందాలను బాగా చూపించారు. కూర్పు కథకి తగినట్టుగా ఉంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. పాటల్లో అంతలా దేవి శ్రీ మార్కు కనపడకపోయినా, ఇలాంటి కథకు సరిపోయినట్టుగానే ఉంటాయి. దర్శకుడిగా కే. ఎస్. రవి కుమార్ మునుపులో కమల్ తో చేసిన హాస్య చిత్రాలకు మల్లే మళ్లీ మెప్పిస్తాడు. ఇది ఆయనకు బాగా అలవాటైన విద్య.
భూషణం గతం అంతా ఒకే పాటలో మొత్తం కథంతా వెనక్కి వెళ్తున్నట్టుగా చూపించే కొత్త ప్రయత్నం చేసారు. అది ఆకట్టుకుంటుంది. ముందు ముందు మనం ఇంకా ఎన్నో సినిమాలలో ఇలాంటి ప్రయత్నం చూసే అవకాశం ఉంది.

చివరి మాట:
కథలో మరీ కొత్తదనమేం ఉండదు. ఈ మధ్య కాలంలో వచ్చిన కమల్, కే.ఎస్. రవి కుమార్ ల తెనాలి, పంచతంత్రం లాంటి హాస్య చిత్రాల మల్లే ఉంటుంది. అందరి నటుల నుండి మంచి నటన, మాటలు, సన్నివేశాల్లోని హాస్యం సినిమాకు బలం. ఆఖరి ఒక గంట బాగా నవ్వించేసారు. ఫక్తు వినోదం కొరకు ఎదురు చూసే వాళ్ళు, కమల్ అభిమానులు మరో ఆలోచన లేకుండా చూడొచ్చు. అలా అని మరీ గొప్ప చిత్రమేం కాదు.

మార్కులు: 3/5

No comments:

Post a Comment