అవును నేను మాట్లాడేది ప్రముఖ నటుడు, మెగాస్టార్ గా ఆంధ్ర(బాబోయ్ నేను చెప్పేది మొత్తం ఆంధ్ర ప్రదేశ్ గురించి... మనందరం ఇంకా ఆంధ్రులమే) అభిమానుల అభిమానాలు చూరగొన్న చిరంజీవి గారి ఆశల, ఆశయాల రూపం 'ప్రజా రాజ్యం' గురించే! ప్రస్తుతం అది లేదనుకోండి.... ఐనా పేరులో ఉన్నట్టుగా ప్రజల స్వామ్యం అనే పలుకుబడి ఉన్న రాజకీయం ఏమైనా నిజంగా ప్రజా రాజ్యమా... కాదు కదా. ఇది 'దగా రాజ్యం'... మారే జనం, దూరే జనం, చూసే జనం అంతా బానే ఉండగా మధ్యలో అర్థ రాత్రి స్వాతంత్రం లాగా నీ గోల ఏంటి రాకేషా అనుకోకండి. ఎవరో పిలిచినట్టుగా వచ్చి, మంచి మాటలతో మొదలుపెట్టి మాయ మాటలతో కట్టి పెట్టి, మాటలకీ చేతలకి మాట మాత్రమైనా సంబంధం లేకుండా మరో పార్టీ కి అంకితం అనిపించుకున్న అభిమాన నటుడికి వినిపించేలా, కనిపించేలా కాకపోయినా చుస్తాడేమో అనిపించేలా కొన్ని మాటలు ఈ బుల్లిబ్లాగు ద్వారా చెపుదామని భావించే ఇంటర్నెట్ సమాజంలో బ్రతికే ఒక పిచ్చి వోటరు మనసులో మాట!
అందరూ అనుకున్నట్టుగా చిరంజీవి గారు జనాల్ని కొత్తగా మోసం చేసిందేం లేదు. ఇదంతా అసాధారణ రాచకీయ(అచ్చు తప్పుకాదు... సరిగ్గానే పడింది) చరిత్రలో ఎప్పుడూ ఉన్న భాగోతమే. ఆయన చేసిన పనికి కాస్త కోపమొచ్చినా ప్రస్తుతం ఆయన్ని చూస్తుంటే నవ్వొస్తుంది. పదేళ్లుగా రాజకీయ ప్రవేశానికై ఎన్నో వదంతులు వస్తున్నా అసలు చలించని చిరంజీవి గారు తెలుగు నాట రాజకీయ సంక్షోభం కనుచూపు మేరలో ఉంటుండగానే రంగప్రవేశానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
వెండి తెరకి మకుటం లేని మహారాజు, అన్న గారి(మీరు అక్షరాలా కరెక్టు... స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే) తర్వాత అంతటి జనాభిమానం ఉన్న నటుడు అయిన చిరంజీవి గారికి రాజకీయాల్లో నటనా వంటబట్టలేదు.... సంభాషణలు పలకటము చేత కాలేదు.... ఆ ఎత్తుగడలు తెలిసి రాలేదు. జనాల్ని మోసం చేయటానికి ఆయనేం గెలిచిన నాయకుడు కాదు... సొంత నిర్ణయాల చేతిలో చావు దెబ్బ తిని మూలన పడ్డ పిరికి(క్షమించాలి...) నేత. లెక్కపెట్టుకుంటూ పోతే పార్టీ ప్రకటించిన తర్వాత ప్రజల అభిమానం పోగొట్టుకునే క్రమంలో ఆయన వేసిన తప్పటడుగులు, తిన్న దెబ్బలు ఎన్నో మరెన్నో.... అందులో నేను లెక్క పెట్టిన కొన్ని ఇదిగో ఇక్కడ రాస్తున్నా....
1. పార్టీ వ్యవహారాలలో తన సొంత వాళ్ళనే కానీ ఇన్నేళ్ళుగా సొంత మనిషిలా ఆదరిస్తున్న అభిమానులకు కాస్తైనా అవకాశం ఇవ్వకపోవటంతోనే వోటు బ్యాంకుకు పెద్ద లోటుని సమకూర్చుకున్నాడు చిరంజీవి
2. ఎన్నో ఉత్తమ భావాలతో నిండిన పార్టీ ఎజెండా కి బలమిచ్చేది మంచి నాయకులు లేదా మంచివారైన మనుషులే కానీ, పక్క పార్టీలలో టికెట్లు రాక అవకాశం కోసమై ప్రజా రాజ్యాన్ని ఆశ్రయించిన వృధా నాయకులు కాదు. అభ్యర్థుల ఎన్నికలో, పక్క పార్టీల వారిని అనుమతించటంలో చిరూ పార్టీ కాస్తైనా పద్ధతి పాటించక పోవటం పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చింది.
3. ఆఖర్లో టికెట్లకై పెద్ద మొత్తం లో డబ్బులు తిన్నారన్న వార్త ప్రజా రాజ్యం లో మొదటి 'సగానికి' పెద్ద పోటే వేసింది. అసలు పార్టీలో అరవింద్ గారి పాత్రే మొదటనుండి ప్రశ్నార్థకం. ఆఖరికి ఆయన అతి నమ్మకానికి జనాలు తగిన ముగింపే ఇచ్చారు. చిరంజీవిగారు సొంత నియోజక వర్గం లో ఓడిపోవటం కూడా పెద్ద దెబ్బే.
4. ఎలెక్షన్ లో ఓడిన మరుక్షణం వలస నాయకుల దగా పోటు పార్టీ మూలాలనే కదిలించేసింది. అసలు పార్టీ లో ఇంకేమైనా మిగిలి ఉందా అనే ఆలోచన కూడా తెచ్చేసింది. ఈ విషయంలో పలు మార్లు తన బాధ విలేఖరుల ముందు వెళ్ళగక్కిన చిరూ గారు తన రాజకీయ ప్రతిభ ఎంత తక్కువో చూపించారు.
5. మొదట్నుండీ తెలంగాణకి అనుకూలం అని చెపుతూనే, నాటకీయ పరిణామాల మధ్య కేంద్రం తెలంగాణా ప్రకటించిన వెంటనే ప్రజా రాజ్యం లోని తెలంగాణేతర ప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గి తన ఆలోచనే మార్చుకోటం నాయకుడిగా, మాట మీద నిలపడే ప్రజల మనిషిగా ఆయన మీద ఎక్కడో మిగిలున్న ఆ కాస్త అభిమానం కూడా పోగొట్టుకున్నాడు.
చివరగా, జగన్ వర్గం చెక్ పెడుతుందని భయపడి తమ చిక్కుని వదిలించునే క్రమంలో చిరుకి ఏవో ఆశలు పెట్టి తమ వైపు లాక్కున్నారు కాంగ్రెస్ పెద్దలు. వారి సమస్య తీరినా పాపం చిరు కొత్త సమస్యలో ఇరుక్కుపోటం కాంగ్రెస్ మార్కు రాజాకీయాలకు అసలు నిదర్శనం. అభిమాన నటుడిగా ఎన్నో ఏళ్లుగా పేరు ప్రతిష్టలు సంపాదించిన గొప్ప నటుడు, మంచి మనసున్న చిరు తన ఆశయ సాధనలో అతి తక్కువ కాలంలో చతికిల పడటం అందరికీ మింగుడు పడని విషయం. ఇంత గొప్ప వ్యక్తి పార్టీ పెడితే రెండే కారణాలుండాలి.... ఒకటి పేరు కోసం, లేక జనం కోసమో. ప్రజా రాజ్యం పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేయటంలో ఆయనకీ ఈ రెంటిలో ఏదీ సాధించే అవకాశం రాదు. పార్టీ అలానే ఉంచి కాంగ్రెస్ వారికి సపోర్ట్ ఇచ్చినా భవిష్యత్తులో పది-పాతిక టికెట్లతో కష్టపడి ఏదో ఒకనాడు పార్టీ ని గెలిపించే అవకాశం ఉండేదేమో. ఇప్పుడు మహా అయితే ఏదో మంచి పదవి దొరకొచ్చు. అది కూడా వచ్చే ఎలెక్షన్ల వరకే. కాంగ్రెస్ పార్టీ లో వృద్ధ, వృధా నాయకులతో పాటు దగా నాయకులకీ కొదవ లేదు. వారందరూ కలిసి కొట్టుకునే క్రమంలో రాజకీయం రాని చిరు ఎంత వరకు నెగ్గుకురాగలడు అనేది ఎంతకీ అంతు చిక్కని ప్రశ్న. మరికొన్నేల్లలో ప్రతిష్ట, రాజకీయ జీవితం రెండూ మరుగున పడించుకునే మెగా స్టార్ చిరంజీవికి, అతి తక్కువ కాలమే అయినా అంతో ఇంతో ప్రయత్నం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ... ముందు ముందైనా మంచో, రాజకీయమో తెలుసుకొని మళ్లీ అభిమానులని ఆనందింప చేయాలని మనవి చేసుకుంటూ సెలవు.
No comments:
Post a Comment