Friday 18 September, 2009

ఈనాడు

నటీనటవర్గం: కమల్ హాసన్, వెంకటేష్
సంగీతం: శృతి హాసన్
కథ: నీరజ్ పాండే
నిర్మాత
: కమల్ హాసన్, చంద్ర హాసన్
దర్శకత్వం: చక్రి తోలేటి
ఫలితం: ఆకట్టుకుంటుంది!!

మూల కథ:
ఒక అజ్ఞాత వ్యక్తి నగరంలో పేలుడు పదార్ధాలు పెట్టానని భయపెట్టి ఖైదీలుగా ఉన్న తీవ్రవాద మిత్రులను విడిచిపెట్టమని కోరటం.

వివరాలు:
నీరజ్ పాండే దర్శకత్వంలో వచ్చిన హిందీ సినిమా 'ఎ వేడ్నేస్డే' ఆధారంగా నిర్మించిన చిత్రం ఇది. బాంబులు పెట్టానని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి జైళ్ళల్లో ఉన్న తీవ్రవాదులను నలుగురిని వదిలిపెట్టమని అడిగే పాత్రలో కమల్ హాసన్, ఆయనకి సమాధానం చెప్పే పోలీస్ కమిషనర్ పాత్రలో వెంకటేష్ నటించారు. సినిమా అంతా చివర్లో వచ్చే కొన్ని కీలకమైన సన్నివేశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతవరకు ఇది ప్రేక్షకులను సస్పెన్స్ లో ఉంచే కథ. కమల్ కి, వెంకటేష్ కి, ఒక టెలివిజన్ రిపోర్టర్ కి మరియు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లకు మధ్యలో జరిగే సంభాషణలు, సన్నివేశాలే ఈనాడు సినిమా. ముంబై బాంబు దాడుల నేపథ్యంలో ఉన్న కథని తెలుగు/తమిళ్ నేటివిటీ కి అనుగుణంగా మార్చి తీసారు సినిమా. సందేశాత్మక చిత్రమే అయినా ప్రేక్షకుల బోర్ కొట్టించకుండా రెండు గంటల సేపు వాళ్ళని ఆలోచనలో పెట్టే విధంగా ఉంటుంది ఈ చిత్రం. హిందీ లో సినిమా చూసిన వారికి ఇందులో కొత్తగా ఏమీ ఉండదు. అవే సన్నివేశాలను మళ్లీ చూపించారు. తెలుగు వెర్షన్ కొరకు బాగానే కష్టపడి తీసినా అక్కడక్కడా తమిళ వాసనలు కనపడి ఇబ్బంది పెడుతుంటాయి. మొత్తం మీద మంచి ఉద్దేశంతో తీసిన సినిమా. సందేశం బాగుంది.

నటన:
యాభై ఏళ్లుగా తన నటనతో అందర్నీ అలరిస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న కమల్ హాసన్, ఇందులో కూడా తన ప్రతిభకు తగ్గట్టుగానే నటించి మనను ఆనంద పరుస్తాడు. వెంకటేష్ కూడా తనకు ఇచ్చిన పాత్రలో జీవించాడనే చెప్పుకోవాలి. నటనకంటే, పెద్ద హీరో అయ్యుండి కూడా పాటలు లాంటివేం లేని ఒక మామూలు పాత్రలో నటించటానికి ఒప్పుకున్నందుకు ఆయనను మెచ్చుకోవాలి. ఈ సినిమా తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలు నాంది పలుకుంతుందని ఆకాంక్ష. మిగతా నటీ నటులు కూడా వాళ్ల పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

సాంకేతిక విభాగం:
దర్శకుడిగా చక్ర తోలేటి(కమల్ సాగర సంగమంలో ఫోటోగ్రాఫర్ పాత్రలో కనపడ్డ అబ్బాయి) తన పాత్ర బానే పోషించాడు. మొదటి సినిమాలోనే గొప్ప నటులతో పనిచేసే అవకాశం రావటం ఆయన అదృష్టం. ఇది రీమేక్ కాబట్టి ఆయన ప్రతిభ చూపించుకునే అవకాశం ఎక్కువగా రాలేదు. తెలుగులో మాటలు ప్రముఖ దర్శకుడు, 'షో' సినిమాకు గాను ఉత్తమ స్క్రీన్-ప్లే రచయితగా జాతీయ అవార్డు అందుకున్న నీలకంఠతో రాయించారు. చాలా సన్నివేశాలలో మాటలు బాగా ఆకట్టుకునేలా ఉన్నాయ్. అవకాశం ఉన్న దగ్గరల్లా సున్నితమైన కామెడీ పండిస్తూనే సీరియస్ సన్నివేశాలలో మరింత ఆకట్టుకునే మాటలు రాసాడు. ఫోటోగ్రఫీ బాగుంది. శృతి హాసన్ అందించిన నేపథ్య సంగీతం కథ-సన్నివేశాలకు అనుగుణం గా ఉంది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా సినిమాను బాగా తీసారు.

చివరి మాట:
మంచి నటన, ఆలోచింపచేసే కథ, ఆకట్టుకునే కథనం ఈనాడు సినిమాకు బలాలు. హిందీలో చూడని వాళ్లు తప్పక చూడాల్సిన సినిమా. హిందీ లో చుసిన వాళ్లు కూడా కమల్, వెంకటేష్ ల నటన కోసం చూడొచ్చు. కథలో మాత్రం కొత్త విషయమేమి ఉండదు.

వినోదం: 10 కి 8

No comments:

Post a Comment