ముందుగా ప్రత్యేక తెలంగాణావాదులకు, కొన్నేళ్లుగా అభివృధికి అదొక్కటే మార్గం అని నమ్ముతున్న అశేష తెలంగాణా ప్రజానీకానికి, తెలంగాణాని అడ్డు పెట్టుకొని వ్యక్తిగతంగా, రాజకీయంగా ఎదగాలని, పలుకుబడి పెంచుకోవాలని గుంటనక్కల్లా ఎదురుచూస్తున్న మన నాయకులకు, ప్రజా పతినిధులకు, తెలంగాణా రాష్ట్రం కొరకై ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన ఆనాటి వీరులకు, ఈ నాటి ధీరులకు, ప్రత్యేకరాష్ట్రమే పనిగాపెట్టుకొని పనులన్నీ పక్కన పెట్టిమరీ పాటుపడ్డ ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతఙ్ఞతలు. ఆపధర్మంగా వచ్చి సొంత ధర్మంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలుచేపడుతున్న గౌరవనీయులు కొణిజేటి రోశయ్య గారి సమక్షం లో దేశంకాని దేశం నుండి వచ్చి అతి క్లిష్ట పరిస్థితుల్లో మన దేశ బాధ్యతను భుజాలమీద వేస్కొని దేశ గౌరవాన్ని, కుటుంబ పరువును ముందుండి నడిపిస్తున్న సోనియమ్మ మాటగా, ఆర్థికంగా ఎదిగించలేకపోయినా అద్భుతమైన ఆర్ధిక మంత్రిగా ఎంతో పేరు సంపాదించిన చిదంబరం గారి నోటి వెంట నిన్నరాత్రి ప్రత్యేక తెలంగాణా విషయమై వచ్చిన మాట తెలుగునాట ఎందరో తెలంగాణా వాదులను ఆనందపెట్టినప్పటికీ పలుప్రయోజనాల దృష్ట్యా సమైక్యాంధ్రకై పోరాడుతున్న ఎందరో పెద్దలను దిగ్భ్రాంతికి గురిచేసిన మాట వాస్తవం. ఇప్పుడు వారు పోరాటం మొదలు పెడతారు అన్నది జగద్విదితం కాబట్టి వారికి నా శుభాశీస్సులు.
జాతీయ నాయకత్వం నుండి వచ్చిన సందేశాలకు ఆనందడోలికల్లో తేలియాడుతున్న తెలంగాణా ప్రజలకు నాదొక చిన్నప్రశ్న... ఇదేనా మనం కోరుకుంది? అన్నీ కుదిరాయనుకొని ఇక మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చా? నన్నడిగితే కాదనేచెప్తాను. 5 ఏళ్ల క్రితం తెలంగాణా నినాదంతో అభికారంలోకి వచ్చి, సెకండ్ ఎస్సార్సీ అనే పేరుతో ఎంత నాన్చాలో అంత నాన్చి అసలు ఆ ఉద్యమాన్నే తెరమరుగుచేసినంత పని చేసిన కాంగ్రెస్ నాయకుల మాటలు అంత గొప్పవా? వారిచ్చినమాటలో లొసుగులు ఏమి లేవా? తెలంగాణా ఇంక వచ్చేసినట్టేనా?
అసలు ప్రత్యేక రాష్ట్రం గురించి తీర్మానం రాష్ట్ర అసెంబ్లీ లో పెట్టాలన్న ఉద్దేశం ఎంత వరకు సమంజసం? రాష్ట్రనియోజకవర్గాల్లో సగం శాతం కూడా లేని తెలంగాణా గురించి అసెంబ్లీ లో మూడింట రెండొంతుల ఎం.ఎల్.ఎ. ల ఆమోదంపొందటం సాధ్యమేనా? ఇక్కడింకో సమస్య ఉంది. హైదరాబాద్ గురించి స్పష్టమైన ప్రకటనే లేదు. హైదరాబాదు కూడాతెలంగాణా రాష్ట్రంలో వస్తుందంటే నాకు తెలిసి కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రజలు ఎవరూ ఒప్పుకోరు. ఇక హైదరాబాదు లేకుండా ఇస్తామంటే తెలంగాణా వారే ఒప్పుకోరు. అయినా తెలంగాణా జిల్లాల మధ్యలో ఉన్నా హైదరాబాదు ని వేరే గా పెట్టి రాష్ట్రం ఇవ్వటం ఎంత వరకు సమంజసం? మధ్యలో చిల్లు పెట్టి ఇవ్వటానికి ఇదేం వడ కాదు.... ఒక రాష్ట్రం. అందుకే అధిష్టానం హైదరాబాదు గురించి స్పష్టంగా చెప్పకపోవటంతో ప్రతి ఒక్కరు తమకు అనుగుణమైన పద్ధతిలోఉహించుకుంటున్నారు. అసలు ఇంకా హైదరాబాదు అంశం గురించి చర్చ మొదలవకముందే సమైక్యాంద్ర వాదులు తమగళం వినిపించటం మొదలు పెట్టేసారు. రాజీనామాల పర్వం మొదలైపోయింది. అధికార కాంగ్రెస్ పార్టీ లోనే దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. గారి మరణం తర్వాత అంతర్గతంగా, బహిరంగంగా ఎన్నో గొడవలు, కుమ్ములాటలు జరిగాయి. మరి వారిలో ఎవరైనా దీన్ని అవకాశంగా వాడుకోవటం జరుగుతుందా? అసలు రోశయ్య గారి ప్రభుత్వం నిలబడుతుందా? ఇదే జరిగితే తెలంగాణా అంశం మరొక్కసారి మూలన పడే ప్రమాదం ఉంది. ఇవేం జరగకుండా రాష్ట్రఅసెంబ్లీ లో తీర్మానం పెడితే నాకు తెలిసిన లెక్కల ప్రకారం తెలంగాణాకు కావాల్సిన మద్దతు లభించటం కష్టమే. అదేజరిగితే ప్రత్యేక తెలంగాణా జనాల అభీష్టం కాదు అని చెప్పేసి చేతులు దులుపుకోవచ్చు ప్రభుత్వం. ఆ తర్వాత మళ్లీ గొడవ చేస్తామని తెలంగాణావాదులు సర్దిచెప్పుకున్నా ఒక్క సారి ఆగిన ఉద్యమం మళ్లీ ఊపందుకోవాలంటే కష్టమే. ఆవేశంలో తెలంగాణావాదులు పెద్ద గొడవలు చేసినా తట్టుకోవటం కష్టమే. ఎటు వెళ్తోంది తెలంగాణా ఉద్యమం?
తెలంగాణా ఉద్యమం ఈ నాటిది కాదనే విషయం అందరికి తెలుసు. ఇక్కడ అభివృద్దికై ఎన్నో ఏళ్లుగా చాలా మంది పోరాడుతూనే ఉన్నారు. కానీ ఆ ఉద్యమానికి రాజకీయం రంగు పులమటంతోనే కావాల్సిన గుర్తింపు, ప్రత్యేకత వచ్చింది. గడిచిన 8 ఏళ్లలో తెలంగాణా పేరుతో పుట్టుకొచ్చిన పార్టీలకు అంతే లేదు. వారందరూ ఉనికిని కాపాడుకోవటం కోసం పడ్డపాట్లు, తప్పిన మాటలు అన్నీ ఇన్ని కావు. తెలంగాణా ప్రజల శ్రేయస్సే తమ ఆశయం అని చెప్పుకున్న వాళ్ళలో ఎంతమంది ఇప్పుడు జరిగిన ఉద్యమంలో పార్టీలకతీతంగా కలిసి పోరాడారు? సమాధానం అందరికి తెలుసు. అసలు వీరంతా ప్రజల శ్రేయస్సు కొరకు వచ్చిన వారేనా లేక రాజకీయ శ్రేయస్సు కోసం వచ్చిన వారా? తెలంగాణా వచ్చినంత మాత్రాన సమస్యలన్నీ తీరిపోతాయా? అభివృద్ధి వచ్చేస్తుందా?
గడిచిన ఎన్నో ఏళ్లలో సౌరాష్ట్ర, ఉత్తరాంచల్, జార్ఖండ్ అంటూ బోల్డన్ని కొత్త రాష్ట్రాలను చూసాం. వీటిలో ఏవీ అనుకున్నంతగా అభివృద్ది చెందకపోగా ఉన్న దరిద్రాలు సరిపోనట్టు మరెన్నో కొత్త స్కాంలకు వేదికలయ్యాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణా కి కూడా అదే గతి పట్టదని నమ్మకమేంటి? తెలంగాణా కోసం ఇప్పుడు పోరాడుతున్న రాజకీయ నాయకుల గత చరిత్రలు అందరికీ తెలిసినవే. చూస్తూ చూస్తూ వీళ్ళనెలా నమ్మటం? వోట్ల కోసం వట్టి మాటలు ఎన్నో చెప్పి అధికారం కోసం ఆ మాటలను ఎన్ని సార్లైనా తప్పటానికి వెనకాడని వీరి మొహం చూసా మనం ప్రశాంతంగా ఉండేది? అసలు తెలంగాణా కావాలా వద్దా అని అడగాల్సింది అన్నీ ఉండి అధికారాలు వెలగబెడుతున్న ఈ రాజకీయ నాయకులనా లేక ప్రత్యెక తెలంగాణా కోసమో లేక దానికి అతీతంగా వస్తుందని నమ్ముతున్న అభివృద్ది కోసమో ఎదురు చూస్తున్న సామాన్య ప్రజలనా? ఎవరికొరకీ తెలంగానం? అధికారం కోసం పాకులాడే రాజకీయ నాయకుల కోసమా, సరిగ్గా దీనివల్ల ఉన్న ఉపయోగాలు తెలీకుండానే ఆవేశంలో గొడవలు చేసి చదువు పక్కన పెట్టి బంద్ లు ర్యాలీలు చేసే విద్యార్థులు కోసమా, ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకునే రైతన్న కోసమా? ఎవరికోసమీ తెలంగానం? ఒక్క సారైనా ప్రజల అభిప్రాయం అడిగారా? టివి లో కనపడే ప్రజలే తెలంగాణా అనుకుంటే ఇంక తెలంగాణా వచ్చినా ఉండే ప్రయోజనం ఏమీ లేదు. తెలంగాణా లో అభివృద్ది లేకపోవటంతో ఆర్థికం గా వెనకపడ్డ సామాన్యుడు గట్టిగా గళం విప్పి అరవలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారినడగండి ఎందుకు కావాలో తెలంగాణా. పార్టీ లు కూడా తెలంగాణా మీద పార్టీ పరమైన అభిప్రాయం చెప్పటం ఎంతవరకు సమంజసం? వారు కూడా పార్టీ లో ఉన్న అందరి అభిప్రాయాలకు విలువిచ్చి ఆ తర్వాత తమ అభిప్రాయం చెప్పాలి. అంతే కాని ఉద్యమం వేడి చూసో, రాజకీయ ప్రయోజనాలు చూసో కాదు. ఈ ఉద్యమం ఇప్పుడు ఎన్నో కీలక మలుపులు తిరిగి చివరగా ఎటు వెళ్తుందో ఎవరికీ తెలీదు. అభివృద్ది ముఖ్యం కానీ ప్రత్యేక రాష్ట్రమో మరేదో కాదు. ఆలోచించండి, సమస్యను అర్థం చేసుకొని అభిప్రాయానికి రండి. అంతే కాని అసలు సమస్య మీద అవగాహన లేకుండా ఎవరికీ తోచినట్టు వారు మాట్లాడటం, చెయ్యటం సమంజసం కాదు.
ఇది చూడుము
దేశంలో ఏం జరిగినా ముందు బాధపడేది సామాన్యుడైతే, ఆ వెనక బాధపడేది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థగా పేరుపొంది ఎంత సేవ చేసినా తగిన గుర్తింపు, కావాల్సిన లాభాలు సమకూర్చుకోలేకపోతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఎవడికి బాధొచ్చినా పగిలేది బస్సద్దమే..... ఎవడు చచ్చినా కాలేది బస్సే. ఎంత సేవ చేసినా ఆఖరికి మిగిలేది బూడిదే. చూద్దాం ఇంకా ఎన్ని బస్సులు తగలబడ్తాయో ఈ ఉద్యమధాటికి. అవసరమొస్తే బస్సెక్కుతాం. సమయానికి రాకపోతే బుసలుకక్కుతాం. అన్నీ అయ్యాక తగలబెడ్తాం. నోరు తెరిచి న్యాయమడిగే ప్రజలకే లేని న్యాయం ఇనుపముక్కల సాక్షిగా మండే ధరలనీ, పెరిగే జనాభానీ అదేదో కథలో గాడిదలా మోస్తున్న ఈ మూగజీవానికి ఎప్పుడు వస్తుందంటే చెప్పటం ఆ బ్రహ్మ కి కూడా సాధ్యం కాదేమో!!
Awesome write-up. You have a way with words...especially the last para.
ReplyDeleteInteresting perspective Rakesh.
ReplyDeleteEach and every word is so true. But who cares about our words & views?
ReplyDelete